నిఘా వ్యవస్థను పటిష్ట పరిచి నేరాల నియంత్రణ కోసం కృషి చేయాలి…..
- బాసర జోన్ 2 డి. ఐ. జి పరిధిలోని అధికారులతో సమీక్షా సమావేశం
- విజిబుల్ పోలీసింగ్ తప్పనిసరి
- సైబర్ నేరాల నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన కోసం నిర్విరామం కృషి చేయాలి

నిజామాబాద్, జూలై 04 ( లోకంతీరు న్యూస్ ) : నేడు నిజామాబాద్ జిల్లాలో బాసర జోన్ 2 పరిధిలోని నిజామాబాద్ నిర్మల్ అదిలాబాద్ జగిత్యాల జిల్లాస్థాయి అధికారులతో డిఐజి జోన్ 2 బాసర ఆర్ బాస్కరన్, ఐపీఎస్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. డీఐజీ జోన్ 2 బాసర ఆర్ భాస్కరన్, ఐపీఎస్ కు, నిజామాబాద్ , నిర్మల్ , అదిలాబాద్ , జగిత్యాల జిల్లా అధికారులు పూల మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించడం జరిగింది.అనంతరం డీఐజీ గారు రేంజ్ పరిధిలోని జిల్లా పోలీసు అధికారులతో తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని జిల్లాల శాంతిభద్రతల పరిస్థితి , నేర నియంత్రణ , ప్రజలకు అందుతున్న పోలీసు సేవలు , పెండింగ్ కేసుల దర్యాప్తు , మహిళలు మరియు చిన్నారుల భద్రత , సైబర్ నేరాల నియంత్రణ , ట్రాఫిక్ నిర్వహణ , మాదక ద్రవ్యాల నిర్మూలన , కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.
సమావేశంలో జిల్లా వారీగా నమోదవుతున్న నేరాల తీరు , వాటి విచారణలో సాధించిన పురోగతి , నేరస్తులపై తీసుకుంటున్న చర్యలు , వారెంట్ల అమలు , రౌడీ షీటర్లు , హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ , శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజల ఫిర్యాదులను సకాలంలో స్వీకరించి , పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్ నేరాలను అరికట్టాలని , మహిళలు , చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా , విక్రయాలు , వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉండే స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని , ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని డీఐజీ గారు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండాలని , ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు , సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.ఈ సమావేశంలో రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల పోలీసు అధికారులు , యూనిట్ ఇన్‌చార్జ్‌లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని తమ జిల్లాలకు సంబంధించిన పనితీరు , నేర నియంత్రణ చర్యలు , ఎదురవుతున్న సమస్యలు మరియు చేపట్టాల్సిన కార్యాచరణపై డీఐజీ గారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్., నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల, ఐపీఎస్., ఆదిలాబాద్ జిల్లా ఎస్పీఅఖిల్ మహాజన్, ఐపీఎస్., జగిత్యాల్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపిఎస్., మరియు అదనపు ఎస్పీలు , ఏసీపీలు , సిఐలు , రిజర్వ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది.