Take a fresh look at your lifestyle.

భీంగల్ అభివృద్ధి పనులపై హెచ్చరిక గడువు దాటితే పోరాటమే…..

0

భీంగల్ అభివృద్ధి పనులపై హెచ్చరిక గడువు దాటితే పోరాటమే

– ఆగస్టు 15లోపు భీంగల్ లో నాలుగు ప్రధాన పనులు పూర్తి చేయాలి.. లేదంటే ఆగస్టు 16 నుంచి ఉద్యమం ఉధృతం

– 100 పడకల ఆసుపత్రి, బస్ డిపో, మార్కెట్ యార్డ్, రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలి

– బీఆర్ఎస్ 15 నెలల్లో రూ.15.50 కోట్ల ఆసుపత్రి పనులు పూర్తి చేయగా, కాంగ్రెస్ 30 నెలల్లో రూ.3 కోట్ల పనులే చేసింది

– మహేష్ కుమార్ గౌడ్ భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

– ఆగస్టు 15లోపు పనులు పూర్తి చేస్తే కాంగ్రెస్ నాయకులను సన్మానిస్తాం..లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం తప్పదు

– పోలీసులు అడ్డుకున్నా వేల్పూర్ నివాసంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష

– దీక్షను భగ్నం చేయడానికి నియోజకవర్గ వ్యాప్తంగా BRS నాయకుల అరెస్టులు

– ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, రాజీలేని పోరాటం కొనసాగుతుంది

– బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాదు / భీంగల్ , జులై 15 ( లోకంతీరు న్యూస్ ) : భీమ్‌గల్ లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, భీమ్‌గల్ బస్ డిపో, సీసీ-బీటీ రోడ్ల నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.ఆగస్టు 15లోపు నాలుగు ప్రధాన ప్రజా సమస్యలను పరిష్కరించాలి.. లేకుంటే ఆగస్టు 16 నుంచి మళ్ళీ ఉద్యమం ఉదృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే వేముల అల్టిమేటం ఇచ్చారు..

భీమ్‌గల్ అభివృద్దే లక్ష్యంగా అక్కడి ప్రజల న్యాయమైన హక్కుల సాధన కోసం భీంగల్ లో ఎమ్మెల్యే వేముల చేపట్టిన నిరసన దీక్షను భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే వేములను పోలీసులు గృహ నిర్బంధం చేసి , ఆంక్షలు విధించినప్పటికీ వాటిని లెక్కచేయకుండా వేల్పూర్‌లోని తన నివాసంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మంచినీరు కూడా ముట్టకుండా కఠిన నిరాహార దీక్ష ఎమ్మెల్యే వేముల నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే వేముల తీవ్ర విమర్శలు గుప్పించారు.

2014కు ముందు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న భీమ్‌గల్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త రూపు తీసుకువచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. గత పదేళ్లలో దాదాపు రూ.100 కోట్లతో నాలుగు లైన్ల రహదారులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు, పార్కులు, వైకుంఠధామాలు, నింబాద్రి గుట్ట అభివృద్ధి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భీమ్‌గల్ రూపురేఖలు మార్చామని పేర్కొన్నారు.

భీమ్‌గల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.35 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో భవన నిర్మాణానికి రూ.22.50 కోట్లు, వైద్య పరికరాలకు రూ.5 కోట్లు, పన్నులకు రూ.7.50 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 15 నెలల్లోనే రూ.15.50 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు రూ.13.50 కోట్లు చెల్లించిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 నెలల్లో కేవలం రూ.3 కోట్ల పనులు మాత్రమే పూర్తి చేసి రూ.2.70 కోట్లు మాత్రమే చెల్లించిందని విమర్శించారు. ఆ రూ.2.70 కోట్లు కూడా తాను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తరువాతే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ అందరికి విడుదల చేయడంతో వచ్చాయని ఇందులో స్థానిక కాంగ్రెస్ నాయకుల పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.

ఆసుపత్రి కోసం ఇప్పటికే 23 మంది స్పెషలిస్ట్ వైద్యులు కేటాయించబడినా భవనం పూర్తి కాకపోవడంతో ప్రజలకు సేవలు అందడం లేదని వారందరు జిల్లాలో ఒక్కోచోట పని చేయాల్సిన పరిస్థితి ఉండని ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ మూడు నెలల్లో రూ.5 కోట్లు విడుదల చేసి ఆసుపత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారని, ఐదు నెలలు గడిచినా ఆ హామీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని విమర్శించారు.

రైతుల కోసం రూ.3 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్‌ను మంజూరు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.80 లక్షలు విడుదల చేసి పనులు ప్రారంభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్‌కు రూ.1 కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయి పనులు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుతం అక్కడ పిచ్చి మొక్కలు పెరిగే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో మూతపడిన భీమ్‌గల్ బస్ డిపోను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి సహకారంతో రూ.2.10 కోట్లతో ఆధునీకరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రయాణికులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్సులు, కంట్రోలర్లను నియమించి డిపోను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

2023లో రూ.11.50 కోట్లతో మంజూరైన సీసీ, డాంబర్ రోడ్ల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంచార్జ్ మంత్రి తో ఆగమేగాల మీద శంకుస్థాపన చేయించి కంకర వేసి వదిలేసిన రోడ్లను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కోరారు.

ఆగస్టు 15లోపు ప్రభుత్వం ఈ నాలుగు పనులు పూర్తి చేయాలని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

100 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.

భీమ్‌గల్ బస్ డిపోను పూర్తిస్థాయిలో ప్రారంభించాలి.మార్కెట్ యార్డ్‌కు పెండింగ్ బిల్లులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలి.

సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి.

అభివృద్ధి చేస్తే సన్మానిస్తాం.. లేకుంటే సమరమే

రాజకీయాల కంటే ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వం ఆగస్టు 15లోపు ఈ నాలుగు పనులు పూర్తి చేస్తే కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్‌కు తానే స్వయంగా పూలమాల వేసి శాలువాతో సన్మానిస్తానని ప్రకటించారు.

అయితే గడువులోగా పనులు పూర్తి కాకపోతే ఆగస్టు 16 నుంచి భీమ్‌గల్ ప్రజలతో కలిసి భారీ స్థాయిలో ఆందోళనలు, నిరసనలు చేపడతామని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.ఏట్టిపరిస్థితుల్లో నన్ను గెలిపించిన ప్రజల కోసం, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పోరాట పంతాను వదిలేది లేదని స్పష్టం చేసారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం తనకు అండగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

దీక్ష విరమణ 

మాజీ కార్పొరేషన్ చైర్మన్, సంఘ సేవకుడు చేయుత ఫౌండషన్ చేర్మన్ డాక్టర్ మధుశేఖర్ గారు దీక్ష కు సంఘీభావం తెలిపి నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే వేముల దీక్ష విరమింపజేశారు… దీక్షకు వచ్చి మహిళలు,భీంగల్ ఫాస్టర్ అసోసియేషన్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలియజేశారు .ఈ ధీక్షలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపిపిలు, జెడ్పిటిసి లు సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసి లు నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.