మద్యం అమ్మకాలు నిలిపివేయాలని వినతి పత్రం అందజేత.
- బోధన్ ఎక్సైజ్ ఎస్సై కి వినతిపత్రం అందజేస్తున్న పోచారం కాలనీవాసులు.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 05 ( లోకం తీరు న్యూస్ ) : కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కోరుతూ సోమవారం పోచారం కాలనీవాసులు ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.కాలనీలోని కిరాణ షాపులలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరపడంతో పాటు సిట్టింగ్ నిర్వహిస్తున్నారు.దాంతో మద్యంప్రియులు అక్కడే తాగి చుట్టు ప్రక్కల ఇల్లు ఉన్నప్పటికీ తాగిన మైకంలో ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారని వాపోయారు. అంతేగాక ప్రక్కన ఉన్న శ్రీ అభయ బస్వేశ్వర మందిరంలో పూజల నిమిత్తం వచ్చిన మహిళల పట్ల అసభ్యకరంగ ప్రవర్తిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.మద్యానికి బానిసైన యువత త్రాగడానికి డబ్బులు లేక షాప్ ప్రక్కనే ఉన్న ఆలయం ప్రాంగణంలో ఇటీవల రెండు రోజుల క్రితం హుండీని దొంగిలించారాన్నారు. అలాగే కాలనీలో గల ఇళ్లలో ఉన్న చిన్న చిన్న వస్తువులను కూడా దొంగతనాలు చేసి మద్యం సేవిస్తున్నారని కాలనీవాసులు పేర్కొన్నారు. కావున సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా కాలనీలో మద్యం అమ్మకాలను అరికట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.ఈ వినతిపత్రం అందజేతలో శ్రీ అభయ బస్వేశ్వర ఆలయ కమిటీ చైర్మెన్ ఆర్.సుదీప్ కుమార్,హాబిబియా మసీద్ కమిటీ చైర్మెన్ అప్జల్ మియా, కాలనీ వాసులు మస్తాన్, సాలంకే గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.