రైతు ఆవేదన పట్టించుకోని రెవెన్యూ అధికారులు..!
– వినతిపత్రం ఇచ్చి 20 రోజులు గడిచినా స్పందన లేదు
– భూగర్భ జల శాఖ చర్యలు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై రైతు ఆవేదన




నిజామాబాద్ / కమ్మర్పల్లి, జులై 03 ( లోకంతీరు న్యూస్ ) : కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన రైతు నూకల ముత్తన్న తన సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ శివారులో తనకు సుమారు 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న ఈ భూమికి ఒకే ఒక్క బోరు మాత్రమే ఆధారమని తెలిపారు. అయితే ఇటీవల పక్కనే మరో రైతు బోరు వేయడంతో రెండు బోర్ల జలధారలు కలిసిపోయి తన బోరులో నీటి సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈ విషయమై జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారులకు వినతిపత్రం అందించగా వారు సంబంధిత అధికారులకు రైతు యొక్క సమాచారం అందించారు. అయితే ఇదే అంశంపై రెవెన్యూ అధికారులకు సుమారు 20 రోజుల క్రితమే వినతిపత్రం సమర్పించినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి విచారణ గానీ, చర్యలు గానీ తీసుకోలేదని రైతు ఆరోపించారు.
తన జీవనాధారమైన బోరును కాపాడాలని, సమస్యను వెంటనే పరిశీలించి సమస్య ను పరిష్కరించాలని రైతు నూకల ముత్తన్న రెవెన్యూ అధికారులను కోరురు. రైతుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.