జైలు పాలైన మోసగాడు
– నమ్మకాన్ని వమ్ముచేసి లక్షలు కాజేసి….
– స్కానింగ్ సెంటర్ యజమానికి 70 లక్షలకు పైగా టోకరా వేసిన ఉద్యోగులు….
– ముగ్గురిపై వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదు – ఒకరి అరెస్ట్
నిజామాబాద్ క్రైమ్ , జులై 03 ( లోకంతీరు న్యూస్ ) : స్కానింగ్ సెంటర్ యజమాన్యానికి నమ్మకంగా ఉంటూ లక్షల్లో దోచుకున్న ఇద్దరూ ఉద్యోగుల ఉదoతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల అక్రమ దోపిడీని గుర్తించిన యజమాని వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతోవారి బాగోతం బయటపడింది. లోతుగా విచారణ జరిపిన వన్ టౌన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కి పంపినట్లు తెలిపారు.మరో ఇద్దరిలో పరార్ లో ఉన్నట్లు తెలిపారు. .దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ కేంద్రంలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు గుండారం సత్యనారాయణ, మీనా నకిలీ నగదు రసీదులు తయారు చేసి, సంస్థ యాజమాన్యాన్ని మోసం చేసి రూ.70 లక్షలకు పైగా నగదును కాజేశారనే ఆరోపణలపై ఒకటవ టౌన్ పోలీసులు బాధితుని ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని వన్ టౌన్ ఎస్ హెచ్ ఒ రఘుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన స్కానింగ్ కేంద్రం 2009 సంవత్సరం నుంచి సేవలు అందిస్తోంది.ఈ కేంద్రంలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న గుండారం సత్యనారాయణ,, టి. మీనా లు కలిసి పథకం ప్రకారం సంస్థను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, రోగులకు ఇచ్చే అసలు నగదు రసీదుల్లో కార్బన్ పేపరు తొలగించి, అనంతరం అదే బిల్లు నంబర్ పరీక్షల వివరాల మొత్తాలను తక్కువగా చూపిస్తూ నకిలీ రికార్డులు తయారు చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించడం జరిగిందన్నారు. రోగులకు అసలు మొత్తంతో కూడిన రసీదు ఇచ్చిన తర్వాత, కార్యాలయ రికార్డుల్లో మాత్రం పరీక్షల వివరాలు, ఫీజులను మార్చి నమోదు చేయడం ద్వారా రోజువారీ నగదును దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు.ఈ విధానం సుమారు ఆరు సంవత్సరాలుగా కొనసాగిందని, ఈ కాలంలో రూ.70 లక్షలకు పైగా సంస్థకు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.. అంతేకాకుండా, ఈ అక్రమాల గురించి ఇతర ఉద్యోగులు వెల్లడించకుండా వారిని బెదిరించడం, కొన్ని ఆధారాలను మాయం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపారు.. ఇందుకు సంబంధించి 2025 జనవరి నుంచి జూలై వరకు ఉన్న కొన్ని నగదు రసీదుల ప్రతులను పోలీసులకు సమర్పించినట్లు ఫిర్యాదులో వివరించారన్నారు.
ఫిర్యాదు స్వీకరించిన ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అక్రమంగా యజమానికి టోకరా వేసిన డబ్బులతో గుండారం సత్యనారాయణ తన భార్య పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో వెళ్ళడైందన్నారు. ఇందులో భాగంగా
ఆర్థిక లావాదేవీలు, నగదు రసీదులు, సంబంధిత రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించి గుండారం సత్యనారాయణ తో పాటు మీనా, సత్యనారాయణ భార్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి వెల్లడించారు. శుక్రవారం మాణిక్ బండారు గ్రామంలో గుండారం సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు మహిళలు పరార్ లో ఉన్నారని వారికోసం గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతోందని అన్నారు.