నిబంధనలకు విరుద్ధంగా….
ఒకే ప్రాంగణంలో పెట్రోల్ బంక్ – గ్యాస్ ఏజెన్సీ….


లోకంతీరు ప్రతినిధి, జులై 09 ( లోకంతీరు న్యూస్ ) : ఒకే ప్రాంగణంలో పెట్రోల్ బంక్‌తో పాటు గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ జరుగుతున్నట్లు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.భీంగల్ లో అగ్నిప్రమాదాలకు అత్యంత సున్నితమైన పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ సిలిండర్ల నిల్వ ఒకే ఆవరణలో ఉండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా ప్రమాణాల ప్రకారం పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గ్యాస్ గోదాములు మరియు పంపిణీ కేంద్రాల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఒకే ప్రాంగణంలో ఈ రెండు కార్యకలాపాలు నిర్వహించడానికి సంబంధిత శాఖల అనుమతులు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
స్థానికుల కథనం ప్రకారం, ఈ ప్రాంగణంలో పెట్రోల్ విక్రయాలతో పాటు గ్యాస్ సిలిండర్ల నిల్వ, పంపిణీ కూడా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రమాదం సంభవిస్తే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించి, అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.