అన్ని గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్
-
సీసీ కెమెరాల నిఘాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు
-
నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు
-
సీపీ పి. సాయి చైతన్య

నిజామాబాద్ , సెప్టెంబర్ 17 ( లోకంతీరు ) : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన అన్ని గణేష్ మండపాలను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.
గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాలు, వాటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.
5,681 గణేష్ విగ్రహాలు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,681 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో నిజామాబాద్ డివిజన్‌లో 2,545, ఆర్మూర్ డివిజన్‌లో 1,959, బోధన్ డివిజన్‌లో 1,177 విగ్రహాలు ఉన్నాయి. అన్ని మండపాలకు భద్రత కల్పించేందుకు వ్యూహాత్మక చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.
ఆన్‌లైన్‌లో మండపాల రిజిస్ట్రేషన్
ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అవసరమైన పోలీస్ అనుమతుల కోసం నిర్వాహకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిర్వాహకులకు స్థానిక పోలీసులు అనుమతులు మంజూరు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
ప్రతి మండపానికి జియో ట్యాగింగ్
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేశారు. సెక్టార్‌ల వారీగా విధులు నిర్వహించే బ్లూకోర్ట్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో మండపాలను సందర్శించి, ట్యాబ్‌ల ద్వారా మండపాల ఫొటోలు తీసుకోవడంతో పాటు నిర్వాహకుల పూర్తి వివరాలను సేకరించి పోలీస్ వెబ్ అప్లికేషన్‌లో నమోదు చేస్తున్నారు.
ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలోని 5,681 గణేష్ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేసినట్లు సీపీ తెలిపారు. దీనివల్ల ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపాల పూర్తి సమాచారం పోలీస్ అధికారులకు అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో సంఘటనా స్థలానికి పోలీసులు త్వరగా చేరుకునేందుకు మార్గాలను గుర్తించడం సులభమవుతుందని వివరించారు.
24 గంటలూ బ్లూకోర్ట్స్ నిఘా
గణేష్ మండపాల భద్రతలో భాగంగా సెక్టార్‌ల వారీగా విధులు నిర్వహించే బ్లూకోర్ట్స్, పెట్రోకార్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో మండపాలను సందర్శిస్తున్నారు. ప్రతిరోజూ మూడు పర్యాయాలు మండపాలను తనిఖీ చేసి పరిస్థితులను సమీక్షించడంతో పాటు నిర్వాహకులకు భద్రతాపరమైన సూచనలు చేస్తున్నారు. మండపాల వారీగా నిర్వహిస్తున్న పాయింట్ బుక్‌లో పోలీస్ సిబ్బంది తమ సందర్శన వివరాలను నమోదు చేస్తున్నారు.
నిమజ్జన రూట్‌లో 100 సీసీ కెమెరాలు
గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన నిమజ్జన రూట్‌లో సుమారు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.ఐపీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ కెమెరాలను పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఈ కెమెరాల ద్వారా 24 గంటలూ పరిస్థితులను పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. నిర్వాహకులు, భక్తులు పోలీస్ శాఖకు సహకరించి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన కోరారు.