రష్యాలో చిక్కుకున్న వారిని రప్పించేందుకు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ప్రత్యేక చొరవ
– సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఎమ్మెల్యే
– ఎమ్మెల్యే సలహాతో సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
– రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్నట్లు కుటుంబాల ఆరోపణ

నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 29 ( లోకంతీరు ) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు ఉపాధి కోసం రష్యా వెళ్లి, మోసపూరితంగా రష్యా సైన్యంలో పనిచేయాల్సిన పరిస్థితిలో చిక్కుకున్న వారిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.ఎమ్మెల్యే సలహా మేరకు బాధిత కుటుంబ సభ్యులు వారిని సురక్షితంగా రక్షించి భారత్కు తిరిగి తీసుకురావాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు.
రష్యాలో చిక్కుకున్న వారిలో
భుక్యా రవీందర్ (నల్లగుట్ట తండా–మునిపల్లి, జక్రాన్పల్లి), సిర్షు అశోక్ (ఒడ్డెర కాలనీ–పెద్ద వాల్గోట్, సిరికొండ), మెగావత్ ప్రకాష్ (చెరువు తండా–దమ్మన్నపేట, ధర్పల్లి), (ఈ ముగ్గురు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం)
మహమ్మద్ అఫ్జల్ ఖాన్ (తడ్కోల్, బాన్సువాడ) ప్రస్తుతం రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతంలోని యుద్ధభూమిలో చిక్కుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.కుటుంబ సభ్యులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు, సీఎం ప్రజావాణి ఇన్చార్జి గద్వాల్ విజయలక్ష్మి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ మాట్లాడారు. రష్యా సైన్యంలో చిక్కుకున్న నలుగురికి అవసరమైన దౌత్య సహాయం అందించి, వారి సురక్షిత విడుదలకు చర్యలు తీసుకోవాలని జీఏడీ ఎన్నారై అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్లు గంగుల మురళీధర్ రెడ్డి, మహమ్మద్ బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.