నూతన భవనం నిర్మించాలి
– PDSU వినతి

నిజామాబాద్ , ఆగష్టు 24 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా PDSU నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి. నసీర్, ఆర్. వినోద్ కుమార్ లు మాట్లాడుతూ,కళాశాల భవనం పూర్తిగా పాతబడిపోయి, పైకప్పు నుంచి వర్షపు నీరు లోపలికి వస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కళాశాలలో కనీస మౌలిక వసతులు, విద్యుత్ సరఫరా, తాగునీరు తదితర సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.శిథిలావస్థకు చేరిన భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖిల్లా జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు.కళాశాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి, విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించాలని కోరారు. ఈ సమస్యపై ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో PDSU ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో PDSU నగర నాయకులు శిరీష, అంకిత,లక్ష్మి పాల్గొన్నారు.