Take a fresh look at your lifestyle.

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి……

0

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి

  • ఉపాధ్యాయ దినోత్సవంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పిలుపు

  • పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి

  • జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

 

నిజామాబాద్ , అక్టోబర్ 05 ( లోకంతీరు న్యూస్ ) : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ ప్రగతిలో గురువుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని హితవు పలికారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గురుపూజోత్సవానికి శ్రీకారం చుట్టిన అనంతరం, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు, జ్ఞాపికలను బహూకరించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్ధ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారని అన్నారు. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ప్రభుత్వ బడులలో చదివే పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే సదాశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణా విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, తెలంగాణ మోడల్ స్కూల్స్ లను ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేశారు. నాణ్యమైన భోజనం, ఏకరూప దుస్తులు, ఇతర అన్ని వసతులు కల్పిస్తోందని అన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ప్రభుత్వ బడులలో మరుగుదొడ్లు, మూత్రశాలల కోసం రూ.21 కోట్ల నిధులను వెచ్చించామని అన్నారు. ఇంకనూ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎన్ని నిధులు అవసరం ఉన్నా, వాటిని వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులలో మెరుగైన విద్య, విజ్ఞానాన్ని పెంపొందిస్తూ సమాజ ప్రగతికి దోహదపడాలని కోరారు. ప్రభుత్వ బడుల పట్ల విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రులలో నమ్మకాన్ని కలిగించాలన్నారు. విద్యా రంగంలో నిజామాబాద్ జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి మాట్లాడుతూ, మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేస్తూ, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని అన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, మౌలిక వసతుల పెంపు, కొత్త డైట్ మెనూ అమలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు వంటి చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయని అన్నారు. దీనిని గుర్తించిన అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడులలలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని, అన్ని పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. అయితే ఇంకనూ మరింత మెరుగైన విద్యా బోధన జరుగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు గుర్తెరిగి నాణ్యమైన విద్యను బోధించాలని కోరారు. తరగతి గదిలోనే భావిభారత పౌరులు రూపొందుతారని, విద్యార్థులకు ఆయా సబ్జెక్టులతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ధ్యానం, యోగా, పెద్దలను గౌరవించడం వంటి అంశాలను కూడా నేర్పించాలని కల్పించాలని సూచించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, సులభంగా విద్యార్థులు ఆకళింపు చేసుకునే రీతిలో ఆధునిక పద్ధతుల్లో బోధన చేయాలని హితవు పలికారు. ఈ దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎఫ్.ఎల్.ఎన్ విధానంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అంకితభావం, నిబద్దతతో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా తగిన గుర్తింపు లభిస్తుందని, అదే సమయంలో విధుల పట్ల అలసత్వ ధోరణిని ప్రదర్శించే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. హక్కులను కోరుకోవడంలో తప్పు లేదని, అదే సమయంలో బాధ్యతలను సైతం గుర్తెరిగి సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. సమాజానికి ఉత్తమ పౌరులను అందించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నందున బోధన విధులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, విద్యాబుద్ధులు, వినయ విధేయతలు నేర్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేసేది ఉపాధ్యాయులేనని, ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారీ బడులలో చదువుకుంటున్న బాలబాలికల బంగారు భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసి ఆదర్శప్రాయులుగా నిలువాలని ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త పద్ధతుల్లో విద్యను బోధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరింపజేసిన బాలికలకు జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర గీత కార్మిక పారిశ్రామిక సంఘం చైర్మన్ శేఖర్ గౌడ్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, డీ.ఐ.ఈ.ఓ రవికుమార్, డీ.సీ.ఈ.బీ సెక్రెటరీ సీతయ్య, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.