భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కార్మిక శాఖ లో పేరు నమోదు చేసుకోవాలి

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 24 (లోకంతీరు) : ప్రతి ఒక్క భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు కార్మిక శాఖలో తమ పేరు నమోదు చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ అన్నారు.శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశం మందిరంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమంపై జిల్లా స్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్మిక చట్టం ప్రకారం భవనం మరియు ఇతర నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం విలువలో ఒక శాతం సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు సమర్పించాలన్నారు. అదేవిధంగా చట్ట ప్రకారంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే పనులు నిర్వహించేవారు నిర్మాణమునకు అనుమతులు ఇచ్చే అధికారులు ఒక శాతం లేబర్ సెస్ వసూలు చేసి కార్మిక సంక్షేమ బోర్డుకు జమ చేయాలన్నారు. ఈ విధంగా వసూలు చేసిన సెస్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఉపయోగం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ యందు 110 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని, తద్వారా వారు అనేక ఉపయోగాలు పొందుతారని తెలిపారు. నమోదు అయిన వారు సహజ మరణం పొందితే 1 లక్ష 30 వేల రూపాయల వరకు, ప్రమాదవశాత్తు మరణము పొందుతే 6 లక్షల 30 వేల రూపాయల వరకు వారి కుటుంబ లబ్ధి పొందవచ్చని, పాక్షిక వైకల్యం కలుగుతే 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు పొందవచ్చన్నారు. కార్మికుని కుమార్తె వివాహం కు 30 వేల రూపాయలు, ప్రసూతి సహాయ పథకాలకు 30 వేల రూపాయల వరకు పొందవచ్చన్నారు. జిల్లా అధికారులు వారి వారి శాఖలలో నిర్మాణ పనులు జరిగినప్పుడు పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులకు అవగాహన కల్పించి కార్మిక శాఖలో కార్మికుల నమోదు జరిగేటట్టుగా చూడాలని ఆదేశించారు. కార్మిక శాఖ అధికారులు పని ప్రదేశాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కార్మికులను నమోదు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్లు, సిపిఓ రాజారాం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, అన్ని ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.