యువత బెట్టింగ్ ఊబిలో పడద్దు
-
బంగారు భవిష్యత్తు ..నాశనం చేసుకోవద్దు….
-
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి…..

నిజామాబాద్ , ఎప్రిల్ 04 ( లోకంతీరు ) : యువత బెట్టింగ్ ఊబిలో పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ యువతకు పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేసేదేంటంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ అనేది మన రాష్ట్రంలో పూర్తిగా నిషేధం ఉందన్నారు. ఇన్‌ప్లూయెన్సర్లు చెప్పారని, సోషల్ మీడియాలో వచ్చిన లింక్‌లను క్లిక్ చేసి బెట్టింగ్ ఆడవద్దని , బెట్టింగ్ ఊబిలోకి వెళ్లి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కోరారు. ఈజీ మనీ కోసం పెడదారులు పట్టొద్దని , కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విజ్ఞప్తి చేశారు.ఆన్‌లైన్ బెట్టింగ్‌ను పోలీస్ శాఖ కూడా సీరియస్ తీసుకుందని , దీనిపై ఇప్పటికే సిట్‌ను కూడా ఏర్పాటు చేయడం రిగిందన్నారు.బెట్టింగ్ భూతానికి బలై యువకులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం బాధాకరం అన్నారు. మన కమిషనరేట్ పరిధిలోనూ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కేసుల విచారణ ప్రస్తుతం కొనసాగుతోందన్నారు. చాలా మంది బెట్టింగ్ బాధితులు తమ పరువు ఎక్కడ పోతుందనే భయం వారిలో ఉంటోంది. ఇది మంచి పద్దతి కాదన్నారు. అలాంటి వారు ధైర్యంగా ముందుకు రావాలి. వారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. మీరు ఇలా చేయడం వల్ల పరోక్షంగా ఎంతో మందిని కాపాడిన వారు అవుతారన్నారు.బెట్టింగ్ కూపంలోకి వెళ్లి అప్పుల పాలై యువత తీవ్ర మనోవేదనకు గురవుతోందని , తీసుకున్న అప్పులు కట్టలేక చనిపోవాలని అనుకుంటున్నారని , చనిపోవడమనేది సమస్యకు పరిష్కారం కాదన్నారు. జీవితంలో అనేక ఒడిదొడుకులు వస్తుంటాయి. ఒక్కసారి కిందపడిపోతే జీవితం ముగిసినట్టు కాదన్నారు. బంగారు భవిష్యత్ ఎంతో ముందుందని అన్నారు.తల్లిదండ్రులు మీ పిల్లల కదలికలను గమనించండని , ముభావంగా ఉంటే కారణం ఏంటో ఆరా తీయండని. బెట్టింగ్‌కు బానిసలయితే వారికి ధైర్యం కల్పించి దాని నుంచి ఎలా బయటపడొచ్చో సవివరంగా చెప్పండని , మీరు భరోసా కల్పిస్తే ఎలాంటి ఆలోచనలు అనేవి వారికి రావన్నారు.ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన ఎలాంటి సమాచార్నానైన మీరు 1930కి గానీ, డయల్ 100 కాల్ చేసి కాని ఇవ్వొచ్చు. పోలీస్ శాఖ ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటుందన్నారు.