ఎడపల్లి లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
-
ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి


ఎడపల్లి , నవంబర్ 24 ( లోకంతీరు ) : మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐ.కే.పీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా, సజావుగా జరగాల న్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవ ప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని సూచించారు.ఎలాంటి విమర్శలు, వివాదాలకు తావు లేకుండా,అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని స్థానిక అధికారులను సూచించారు.పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ ప్రక్రియను స్థానిక ఐకెపి ఎపిఎం అలాగే సిబ్బంది వేగవంతం చేయడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి, ఎడపల్లి ఐకేపీ ఏపిఎం రాజేందర్, సీసీలు, వివో ఏలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు