దొంగ ఓట్ల కలకలం.. ఇద్దరు అరెస్ట్ !
ఎడపల్లి , ఫిబ్రవరి11 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ పర్వంలో దొంగ ఓట్ల కలకలం రేగింది. రాకాసిపేట్లోని బూత్ నంబర్ 24, గోశాల ఏరియాలోని బూత్ నంబర్ 78లో ఇతరుల పేర్లతో ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న క్రమంలో, నిందితులు తప్పుడు పత్రాలు సమర్పించడంతో పోలింగ్ ఏజెంట్లు, సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో వారు దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లు తేలడంతో, స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఎన్నికల నియమావళి ప్రకారం కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తూ దొంగ ఓట్లు వేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ ఎస్హెచ్ఓ (SHO) ఈ సందర్భంగా హెచ్చరించారు.