జగదాంబ మాత ఆశీస్సులు..
ప్రజల ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యే అయ్యాను
-
ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి
-
తీజ్ ఉత్సవాలకు బంజారా సమాజంలో ప్రత్యేక గుర్తింపు
-
తాండాల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తాం
-
దేవి తాండాకు సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు చొరవ తీసుకుంటా

నిజామాబాద్ రూరల్ , ఆగష్టు 09 ( లోకంతీరు న్యూస్ ) : ఇందల్వాయి మండలం దేవి తాండాలో ఆదివారం నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి సతీసమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా సంప్రదాయ పద్ధతుల్లో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీజ్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, బంజారా మహిళలు, యువతులతో కలిసి సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు.తీజ్ పండుగ సందర్భంగా పెళ్లికాని యువతులు మంచి భర్తను పొందాలని, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారు. గోధుమలతో అంకురాలను పెంచి, సంప్రదాయ నృత్యాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ వేడుకలో ప్రత్యేకత. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి వెదురు బుట్టలను ఎత్తి తీజ్ వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. జగదాంబ మాత ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం వల్లనే తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అన్నారు. బంజారా సమాజం ఎంతో నిష్ఠతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించే తీజ్ ఉత్సవాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేర్కొన్నారు.తాండాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం, తన వంతుగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన నీటి ట్యాంకులు, విద్యుత్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.దేవి తాండా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నందున ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడానికి తన వంతు చొరవ తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. తాండాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని చెప్పారు.దేవి తాండాలోని ఆలయ ప్రాంగణంలో రూ.5 లక్షల నిధులతో నిర్మించనున్న కల్యాణ మండపం షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధితో పాటు తాండాలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకోవడంతో పాటు వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగదాంబ మాత ఆశీస్సులతో, ప్రజల సహకారంతో తాండాలను మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్, అంబర్ సింగ్, హన్మండ్లు, దేవి తాండా సర్పంచ్ గణేష్, ప్రజలు, బంజారా మహిళలు, యువతులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.