నిజామాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ డైవర్షన్
సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు
భారీ వాహనాలకు నగరంలోకి ప్రవేశం నిషేధం
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలి
– సీపీ పి. సాయి చైతన్య
నిజామాబాద్, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : గణేష్ నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకుని నిజామాబాద్ పట్టణంలో సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్‌లు అమలు చేయనున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని పోలీసులు సూచించారు.
హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలకు..
హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు మాధవనగర్ బైపాస్, కంటేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలోనూ ఇదే మార్గాన్ని వినియోగించాలని సూచించారు.
బోధన్ వైపు వాహనాలకు..
బోధన్ నుంచి వచ్చే, బోధన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు అర్షపల్లి చౌరస్తాలో ఎడమవైపు తిరిగి బైపాస్ మీదుగా కొత్త కలెక్టరేట్, కంటేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా బస్టాండ్ చేరుకోవాలి. తిరిగి బోధన్ వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గాన్ని ఉపయోగించాలి.
ఆర్మూర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు..
ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్ బస్టాండ్, ఇతర ప్రాంతాలకు వచ్చే వాహనాలు కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ టీ జంక్షన్ వద్ద కుడివైపు తిరిగి, రైల్వే స్టేషన్ ముందుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలోనూ ఇదే మార్గాన్ని ఉపయోగించాలి.
బాన్సువాడ, వర్ని వైపు వాహనాలకు..
బాన్సువాడ, వర్ని వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు వర్ని చౌరస్తా నుంచి కుడివైపు తిరిగి ఆర్.ఆర్. చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మగుట్ట చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా రైల్వే స్టేషన్ ముందుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలోనూ ఇదే మార్గాన్ని అనుసరించాలని పోలీసులు సూచించారు.సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటల వరకు భారీ వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజామాబాద్ నగరంలోకి ప్రవేశించరాదని పోలీసులు స్పష్టం చేశారు.
కంటేశ్వర్ రైల్వే అండర్ పాస్ ఎత్తు రోడ్డు నుంచి 13 అడుగులు మాత్రమే ఉన్నందున, 13 అడుగుల లోపు ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాలు మాత్రమే అండర్ పాస్ ద్వారా తరలించాలని సూచించారు.13 అడుగులకు మించిన గణేష్ విగ్రహాలు ప్రధాన శోభాయాత్ర రథం వెళ్లిన అనంతరం రైల్వే ఫ్లైఓవర్‌ను ఉపయోగించుకుని వెళ్లాలని పోలీసులు సూచించారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ డైవర్షన్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.