Take a fresh look at your lifestyle.

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది……..

0

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది

— కేంద్రం ఎలాంటి సాయం చేయడం లేదు ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి

       ఇందల్వాయి/గన్నారం, అక్టోబర్ 31 ( లోకంతీరు ) : మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాల వల్ల వరి ధాన్యం తడిసిపోయినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు.ఇందల్వాయి మండలం గన్నరం గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీంచారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యుద్ధ స్థాయిలో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. “రైతు చెమట చుక్క వృథా కాకుండా ప్రతి తడిసిన గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. రెండు రోజుల్లో రైస్ మిల్లులకు తరలించి, మూడో రోజుకే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం,” అని తెలిపారు.ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఐదు నుండి పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, వడ్లతో పాటు నేల తడవడం వల్ల సుమారు 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం దెబ్బతిన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. వర్షం కారణంగా ధాన్యం రంగు మారినా, తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్లకు తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని ఆదేశించారు,” అని ఎమ్మెల్యే తెలిపారు. “రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం,” అన్నారు.నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా, ఇప్పటివరకు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మిగతా 8 లక్షల టన్నులను వారం రోజుల్లో కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తామని తెలిపారు.

కేంద్రంపై మండి పాటు

“తడిసిన ధాన్యం కొనడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రైతుల వెన్నంటి నిలుస్తోంది,” అని మండిపడ్డారు.“బీజేపీ నాయకులు నోరు వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. కేంద్రం నిజంగా రైతుల పక్షాన ఉంటే, సహాయం ప్రకటించాలి,” అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఇందల్వాయి సొసైటీ చైర్మన్ సుధాకర్, గన్నారం సొసైటీ చైర్మన్ గోపి, ఇమ్మడి గోపి, లింగాపూర్ సంతోష్ రెడ్డి, బద్దం రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.