నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి
– అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ అర్బన్ , జనవరి 11 ( లోకంతీరు ) : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తాను అసెంబ్లీలో నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో ప్రతి డివిజన్‌కు కోటి రూపాయల చొప్పున మొత్తం 60 కోట్ల రూపాయలతో జారీ చేసిన జీవోను కొనసాగిస్తూ, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిరోజు నుంచే నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు.నగరంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాల మరమ్మత్తులు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, తారు రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలకు అవసరమైన నిధుల మంజూరు కోసం అసెంబ్లీలో ప్రశ్నించడం తో పాటు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాలను తీసుకెళ్లినట్లు తెలిపారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద డివిజన్ నెంబర్ 1 నుంచి 60 వరకు అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలకు సంబంధించి 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.ఈ నిధుల మంజూరు నిజామాబాద్ అర్బన్ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం అని, డివిజన్‌కు కోటి రూపాయల చొప్పున అభివృద్ధి పనులు ప్రారంభం కావడం నగర అభివృద్ధిలో కీలక అడుగుగా భావిస్తున్నామని అన్నారు.అసెంబ్లీకి వెళ్లిన తొలి రోజు నుంచీ ఇప్పటివరకు నిజామాబాద్ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల కోసం నిరంతరం కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.