అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
– క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

ధర్పల్లి, డిసెంబర్ 23 ( లోకంతీరు ) : ధర్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరుతున్నాయని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని, దేశంలోని అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ేనని పేర్కొన్నారు. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి రూ.20 వేల కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు.
స్వాతంత్ర్యం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అన్ని మతాలను సామరస్యంగా చూస్తూ సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ేనని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన క్రిస్టియన్‌ల కోసం కమ్యూనిటీ హాళ్లను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సమాధుల కోసం స్థలం కావాలన్న అభ్యర్థనపై స్పందించిన ఎమ్మెల్యే, త్వరలో ప్రభుత్వ భూమిని సేకరించి సమాధి స్థలాన్ని కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.
మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత రేషన్ బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. అనంతరం భారీ కేకును కట్ చేసి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్, వివిధ మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ధర్పల్లి సర్పంచ్ చెలిమెలి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజ్, సీనియర్ నాయకులు, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు, ఫాదర్లు, క్రిస్టియన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.