Take a fresh look at your lifestyle.

ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి…..

0

ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

– ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : PDSU డిమాండ్

నిజామాబాద్, జూన్ 22 ( లోకంతీరు న్యూస్ ) : ప్రైవేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్య ఫీజు దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే చర్యలను నిలిపివేయాలని PDSU డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసి, నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే. అషూర్ మాట్లాడుతూ, విద్యను హక్కుగా కాకుండా వ్యాపార వస్తువుగా మార్చే విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ప్రతి సంవత్సరం భారీగా ఫీజులు పెంచుతూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ కోసం సమర్థవంతమైన చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం లేదా విలీనం చేయడం వల్ల పేద, గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. విద్యా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను వెంటనే విరమించుకోవాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి, ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు జి. వైష్ణవి, ఎండి. నసీర్, జి. నితిన్,జిల్లా సహాయ కార్యదర్శి ఆల్గోట్ సృజన్, జిల్లా నాయకులు హేమాంజలి, మహేందర్, మణితేజ, శ్రీశాంత్,అరవింద్,అభినవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.