గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి

నిజామాబాద్, జూన్ 22 ( లోకంతీరు న్యూస్ ) : గ్రామపంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి, ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న మాట్లాడుతూ రాష్ట్రంలోని 12732 గ్రామపంచాయతీల్లో సుమారు 60వేల మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. జీపీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. పెరుగుతున్న ధరలతో కార్మికుల కుటుంబాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల జీవో నెంబర్ 06 ప్రకారం వేచనాలు పెంచి ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. జనాభా ప్రాతిపదికన ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, చనిపోయిన కార్మికులకు ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వేతనాలు పెంచకుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉదృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్ జిల్లా నాయకులు మురళి, సాయరెడ్డి లక్ష్మణ్, గంగాధర్, జీపీ కార్మికులు సాయిలు, మహేందర్, రాజు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.