వసతులు మేము కల్పిస్తాం మంచి వైద్య సేవలు మీరందించండి
– ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
– 2:30 గంటల పాటు సాగిన సమావేశం
– పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
– మెరుగైన వైద్యం అందించి.. మంచి పేరు తేవాలి
– జీజీహెచ్ అభివృద్ధి సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిజామాబాద్ రూరల్, జులై 15 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి సమీక్షా సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, IIHFW చైర్ పర్సన్ డా.కవితా రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ శేఖర్ గౌడ్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉందని, వైద్యులు తమ సేవల ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై మరింత విశ్వాసం పెంపొందించాలని అన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి అత్యుత్తమ సేవలు అందుస్తుందని పేర్కొన్న ఆయన.. మరిన్ని సేవలు ప్రజలకు చేరువ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
తాను వైద్య వృత్తిలో పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని పేర్కొంటూ, ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, ముఖ్యంగా కార్డియాలజీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ వంటి కీలక విభాగాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆయా విభాగాలకు అవసరమైన వెంటిలేటర్లు, ఆధునిక పరికరాలు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని తెలిపారు.
రోగులతో వైద్యులు, సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, సేవా భావంతో విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే సూచించారు. అపారమైన అనుభవం కలిగిన వైద్యులు జిల్లాలో ఉన్నందున వారి సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించాలని కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్థీషియా, ట్రామా కేర్, డెర్మటాలజీ, మానసిక వైద్య విభాగం, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, జిల్లా క్యాన్సర్ సెంటర్, డీ-అడిక్షన్ సెంటర్ తదితర విభాగాల అధిపతులు తమ శాఖల్లో అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న పరికరాలు, అవసరమైన వెంటిలేటర్లు, మౌలిక సదుపాయాలపై వివరాలతో కూడిన నివేదికలను సమర్పించారు. అలాగే ఆసుపత్రిలో చేపడుతున్న ప్రధాన శస్త్రచికిత్సలు, మాతా-శిశు సంరక్షణలో తీసుకుంటున్న చర్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
సమావేశంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సూచించారు. ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తోందని, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
జీరో మోర్టాలిటీ లక్ష్యంగా వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, పారిశుద్ధ్య నిర్వహణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పనిచేస్తోందని, డీ-అడిక్షన్ సేవలను మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు. సమస్యలు ఎదురైనా సమిష్టి కృషితో పరిష్కరించుకుంటూ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రాష్ట్రంలో ఆదర్శవంతమైన వైద్య సంస్థగా తీర్చిదిద్దాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో DMHO రాజశ్రీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆయా విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.
———————————