Take a fresh look at your lifestyle.

ప్రెస్ క్లబ్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…..

0

ప్రెస్ క్లబ్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  

నిజామాబాద్   , ఆగష్టు 15 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.క్లబ్ ఆవరణలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ జాతీయ జండా ఆవిష్కరించారు.
ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జర్నలిస్టు క్రీడా పోటీలను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు.ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్స్ గా మాంతం మధు సహకారం అందించారు. క్రికెట్, షటిల్, క్యారం పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టులకు ఆ సంస్థ నిర్వాహకులు మంతం మధు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడులకు లోనవుతున్న జర్నలిస్టులు ఆటల పోటీలతో ఒత్తిడులు దూరం అవుతాయని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని మంతం మధు అన్నారు. జర్నలిస్టు కార్యక్రమాలకు ఎల్లప్పుడు సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈరోజు మనం కేవలం జెండా ఎగరేయడం లేదు. 200 ఏళ్ల బానిసత్వం నుండి మనకు విముక్తి కలిగించిన ఎందరో త్యాగధనులను స్మరించుకుంటున్నాం. గాంధీజీ, నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి, కొమురం భీం లాంటి వారి త్యాగం వల్లనే ఈ స్వేచ్ఛా గాలిని పీలుస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన రోజున మన రాజ్యాంగం మనకు మూడు స్థంబాలను ఇచ్చింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు. కానీ ఆ మూడింటినీ నిలబెట్టేది నాలుగో స్తంభం మన పత్రికా రంగం అని అన్నారు. నిజామాబాద్ గడ్డకు ఉద్యమాల చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు ఈ గడ్డ మీద నుండి వార్తలు రాసిన ప్రతి కలం ఒక చరిత్రను లిఖించింది. ఇవాళ పాత్రికేయం చాలా సవాళ్లలో ఉంది. ఫేక్ న్యూస్ ఒకవైపు, సోషల్ మీడియా ఒత్తిడి మరోవైపు. కానీ మనం…. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే వేగం కంటే వాస్తవం ముఖ్యం. టి ఆర్ పి కంటే నిజాయితీ ముఖ్యం అని అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి ఒక్కటే. మన కలాలు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలి. అధికారానికి ప్రశ్నగా,…. బాధితుడికి భరోసాగా ఉండాలి చెప్పారు పంచారెడ్డి శ్రీకాంత్.
మనం విభేదించవచ్చు, వాదించవచ్చు, కానీ దేశం విషయంలో, నిజం విషయంలో ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు.ప్రధాన కార్యదర్శి సుభాష్ వాాగ్మారే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అనునిత్యం వార్తలు సేకరించే విధులు నిర్వహిస్తూ ఉంటారు అందుకు కొద్దిపాటి ఉపశమనంగా జర్నలిస్టులకు క్రీడా పోటీలను నిర్వహించుకోవడం ఆనవాయితిగా వస్తుందన్నారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, బిల్డర్ మోహన్ , ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, నగర జర్నలిస్టు, సబ్ ఎడిటర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్ లు, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.