ప్రజాపాలనలో సంక్షేమం–అభివృద్ధికి పెద్దపీట
– ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు లేదు
– స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులతో పారదర్శక పాలనకు శ్రీకారం
– గత పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు
– ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పాలన చేస్తోంది
– అర్హులైన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందిస్తున్నాం
– ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

నిజామాబాద్ రూరల్ , ఆగష్టు 15 ( లోకంతీరు న్యూస్ ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ నుంచి ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన నిజామాబాద్ నగరంలోని భూమా రెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పాల్గొని మాట్లాడారు.
అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి.. తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతుల సంక్షేమానికి రైతు భరోసా, మహిళలు, కుటుంబాలకు అండగా కళ్యాణ లక్ష్మి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం, వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.గత పదేళ్ల కాలంలో కొత్త రేషన్ కార్డుల జారీపై తగిన దృష్టి పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టిందని భూపతి రెడ్డి అన్నారు. తాజాగా డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువస్తున్నామని తెలిపారు.స్మార్ట్ కార్డుల వల్ల లబ్ధిదారులకు రేషన్ పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని, ఎక్కడి నుంచి అయినా స్మార్ట్ కార్డు ద్వారా రేషన్ తీసుకునే అవకాశం ఉండటం వల్ల వలసలు, ఇతర ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించడం ద్వారా నకిలీ కార్డులు, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందించే దిశగా చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆహార భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సంక్షేమం అనేది కేవలం ప్రకటనల్లో కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించేలా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ప్రజాపాలనలో మరో కీలక ముందడుగు పడిందన్నారు. సాంకేతికత ఆధారిత పాలన ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సరళంగా, పారదర్శకంగా ప్రజలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.2047 నాటికి రైజింగ్ తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని భూపతి రెడ్డి అన్నారు. సంక్షేమంతో పాటు మౌలిక వసతులు, వ్యవసాయం, విద్య, ఉపాధి, ప్రజా సేవల రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు? ఎవరు ప్రజల పక్షాన నిలుస్తున్నారు? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.