జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర
– స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

కామారెడ్డి ప్రతినిధి , ఏప్రిల్ 04 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర లో భాగంగా ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు, సదాశివనగర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ పాదయాత్ర ప్రారంభానికి ముందు,వారు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రి బాయి ఫూలే, గౌతమ బుద్ధుడు మరియు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయాలను స్మరించుకుంటూ, రాజ్యాంగ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, “భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించే గొప్ప పత్రిక. ఇది మన దేశాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు నడిపే దీపస్తంభం. అలాంటి రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత” అని అన్నారు.
ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కల్గించి, రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడిందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.