కోనోకార్పస్ చెట్లను తొలగించాలి
– CPI(ML) మాస్ లైన్ (ప్రజాపంథా) డిమాండ్

నిజామాబాద్, జనవరి 06 ( లోకంతీరు ) : మానవాళికి, ప్రకృతికి ప్రమాదకరమైన కోనో కార్పస్ చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కోనో కార్పస్ చెట్లు మానవాళికి, ప్రకృతికి తీవ్ర నష్టకరమని అన్నారు. ఈ చెట్లు భూగర్భ జలాలను విస్తృతంగా పీల్చుకుంటూ, ఇతర చెట్లను పెరగనియ్యవన్నారు. ఈ చెట్ల పుప్పొడి పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు వస్తాయన్నారు. ఈ చెట్లపై పక్షులు కూడా వాలవంటే ఇవి ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలన్నారు. కోనో కార్పస్ చెట్లు ప్రమాదకరమైనవని శాస్త్రవేత్తలు సైతం తేల్చారన్నారు. అందువల్లే ఈ చెట్లను ప్రపంచ దేశాలు నిషేధించాయని, మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ నిషేధించారన్నారు. ఈ చెట్ల వల్ల ఇప్పటికే చాలామంది తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరింత మంది అనారోగ్యాల బారిన పడకుండా, ప్రకృతి సమతుల్యం కోసం ఈ చెట్లను వెంటనే తొలగించాలన్నారు.
సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గార్లు కోనో కార్పస్ చెట్లను నగరంలో వీలైనంత తొందరగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాసరావు, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, న్యాయవాది రాహుల్ పాల్గొన్నారు.