Take a fresh look at your lifestyle.

మంగల్ పాడ్ గ్రామం లోచట్ట విరుద్ధ కుల బహిష్కరణ ప్రజావాణిలో ఫిర్యాదు…..

0

మంగల్ పాడ్ గ్రామం లోచట్ట విరుద్ధ కుల బహిష్కరణ ప్రజావాణిలో ఫిర్యాదు 

ఎడపల్లి, ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం పరిధిలోని మంగల్ పహాడ్ గ్రామంలో చట్టవిరుద్ధ కుల బహిష్కరణ ఘటన వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. గ్రామానికి చెందిన రఘుపతి అబ్బయ్య తన కుటుంబంపై కుల సంఘం పెద్దలు అన్యాయంగా విధించిన బహిష్కరణపై జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.బాధితుడి వాఖ్యాన ప్రకారం, తన స్వంత భూమిని ఒక వ్యక్తి అక్రమంగా కబ్జా చేయడానికి యత్నించగా, ఆ విషయాన్ని కుల పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించాల్సిన స్థానంలో ఉన్న పెద్దలు, వివాదాస్పద భూమిని ప్రత్యర్థి వ్యక్తికే అప్పగించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు.అదేవిధంగా, రాజీ పేరుతో డబ్బు తీసుకుని వ్యవహారాన్ని ముగించాలనే సూచనలు చేసినప్పటికీ తాను నిరాకరించడంతో ప్రతీకార ధోరణిలో తన కుటుంబాన్ని కుల బహిష్కరణకు గురిచేశారని వెల్లడించారు.కుటుంబ సభ్యులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనరాదని, బహిష్కరిచబడిన కుటుంబంతో వివాహ సంబంధాలు కుదిరినా రూ.12,000 జరిమానా విధిస్తామని బెదిరింపులు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యలతో కుటుంబం తీవ్రమైన మానసిక వేదనకు గురైందని, కుటుంబ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు.కుల బహిష్కరణ భారత రాజ్యాంగ విరుద్ధమని, తక్షణమే విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు జిల్లా అధికారులను కోరారు. ఈ ఘటనపై అధికార యంత్రాంగం స్పందన ఏమిటన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.