Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలల వైపు ప్రజల అడుగులు..!

0

ప్రభుత్వ పాఠశాలల వైపు ప్రజల అడుగులు..!

నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో విద్యార్థుల చేరికలు

– ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 5,111 మంది విద్యార్థుల ప్రవేశాలు
–  ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులను అభినందించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
–  పాఠశాలల పనితీరులో మెరుగుపడిన తెలంగాణ
–  599.70 స్కోర్ తో దేశంలో 18 వ స్థానంలో తెలంగాణ- పిజిఐ 2025-26 నివేదిక వెల్లడి

నిజామాబాద్ , జులై 08 ( లోకంతీరు న్యూస్ ) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, ఆధునిక సాంకేతిక వసతులు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా విశిష్ట ఘనతను సాధించింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి 5,111 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో రోజురోజుకూ విశ్వాసం పెరగడం ఎంతో ఆనందదాయకమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆంగ్ల మాధ్యమ బోధన, డిజిటల్ తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, విద్యార్థి కేంద్రిత బోధన అందుబాటులోకి రావడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి శ్రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్య బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.అందుకు నిదర్శనమే ఇటీవల కేంద్ర విద్యాశాఖ 2025-26 కు గాను విడుదల చేసిన పిజిఐ (పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్) లో 599.70 స్కోర్ తో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 18 వ స్థానంలో నిలవగా ప్రచేష్ట-3 గ్రేడ్ లోకి రాష్ట్రం చేరుకోవడం గర్వకారణమన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం ద్వారా ప్రతి కుటుంబం నాణ్యమైన విద్యతో పాటు సమాన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి సాధించిన సమిష్టి విజయమని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.