పుష్కరాల భద్రతకు ముందస్తు ప్రణాళిక పోచంపాడు ఘాట్లను పరిశీలించిన సీపీ
– గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన

నిజామాబాద్,జులై 16 ( లోకంతీరు న్యూస్ ) : వచ్చే సంవత్సరంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన భద్రత , ట్రాఫిక్ నియంత్రణ , రద్దీ నిర్వహణతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) మరియు పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల నిర్మాణ పరిస్థితులు , భక్తుల రాకపోకలకు అనువైన మార్గాలు , వాకింగ్ ట్రాక్‌లు , వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు , అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు , హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు , కమాండ్ కంట్రోల్ వ్యవస్థ , తాత్కాలిక పోలీస్ సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, పారిశుద్ధ్యం , అత్యవసర స్పందన బృందాల ఏర్పాటుపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి , ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి , మెండోరా ఎస్సై సుహాసిని , ఇరిగేషన్ శాఖకు సంబంధించిన డి.ఈ సురేష్ , ఏ.ఈ సుశాంత్ కుమార్ , వంశీ , పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ , డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగింది.