జిల్లాలో అరుదైన ఆదిమానవుల తావులు, రాతి చిత్రాల నెలవులు
– జిల్లెల్ల సరిగుండ్ల గుట్టలో రాతి చిత్రాలు..
– కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తెలుగులోకి తెచ్చిన సందర్భం..

సిరిసిల్ల, జులై 16 ( లోకంతీరు న్యూస్ ) : మన పూర్వీకులైన ఆదిమానవుల తావులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేకం వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా నది పరివాహక ప్రాంతాలైన మూలవాగు, మానేరు వాగు చుట్టూ అల్లుకొని ఎన్నో ఆదిమానవుల తావులు రాతిగుండ్లపై గీసిన కళారూపాలు వెలుగు చూస్తున్నాయి. “ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం” సభ్యుల పరిశోధనలో మరో అరుదైన ఆదిమానవుల రాతి చిత్రాల తావు వెలుగు చూసింది. ఇప్పటికే రాజన్న జిల్లా కేంద్రానికి సమీపంలోని రామప్ప గుట్టల్లో, నాంపల్లి సమీపంలోని గుట్టలతో పాటు, ఎల్లారెడ్డిపేట కోనరావుపేట్ మండలలా సరిహద్దులోని సితారిగట్టు సమీపంలోని ఆదిమానవులు తావులు రాతిపై వేసిన చిత్రాలు వెలుగు చూసాయి. సిరిసిల్ల పట్టణ శివారు ప్రాంతంలోని బైపాస్ సమీపంలో ఎల్లారెడ్డిపేట్ మండల సిరిసిల్ల సరిహద్దు ప్రాంతమైన బైపాస్ సమీపంలోని “బుర్కగుట్ట” పైన రాతి గుండును తొలిచి ఆదిమానవులు వేసిన చిత్రాలు అరుదైన రాతి చిత్రాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ముస్తాబాద్ సమీపంలోని గన్నేవారిపల్లి సమీపంలోని మైసమ్మ గుండు పై ఆదిమానవులు గీసిన రాతిపై చిత్రాలను ఐదు సంవత్సరాల క్రితంమే బృందం సభ్యులు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మూలవాగు మానేరు వాగును అల్లుకుని ఉన్న గుట్టల్లో ఆదిమానవుల రాతి చిత్రాల తావులు అనేకం వెలుగు చూసాయి. తాజా గా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల సమీపంలోని సరం గుండ్ల గుట్టల్లో అరుదైన రాతి చిత్రాల తావును కొత్త తెలంగాణ చరిత్ర బంధం సభ్యులు వెలుగులోకి తెచ్చారు. రాతి చిత్రాలనే కాకుండా ఆనాడు ఆదిమానవులు రాతి పనిముట్లను పదును పెట్టేందుకు ఉపయోగించిన తావులు కూడా తమ పరిశోధనలో వెలుగు చూసినట్లు పరిశోధక బృందం సభ్యులు తెలిపారు. పదివేల సంవత్సరాల క్రితం నాటి రాతియుగం నాటి కళాకృతులని బృందం సభ్యులు తెలుపుతున్నారు. చరిత్ర అన్వేషణలో కొనసాగింపుగా రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్వ చరిత్రను పదిలం చేసిన తావులను సంరక్షించి భవిష్యత్ తరాలకు ఆదిమానవులు అడుగుజాడలు పట్టి చూపే రాతి చిత్రాల తావులను పదిలం చేయవలసి ఉంది. చరిత్ర పరిశోధనలో అనేక చారిత్రక విషయాలను వెలుగులోకి తెస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులను అభినందించాల్సిందే.