మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్‌తోనే పూర్తి చేస్తాం
– ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
– కాంగ్రెస్ డిజైన్ ను రద్దు చేసి కమీషన్లకు గత ప్రభుత్వం కక్కుర్తి పడ్డది
– 1300 కోట్లతో అయ్యే పనిని 3000 కోట్లకు పెంచింది
– కాళేశ్వరం లాగా ముంచాలని చూసారు
– రైతుల కోరిక మేరకే ప్రణాళికలు

నిజామాబాదు రూరల్, జులై 16 ( లోకంతీరు న్యూస్ ) : రైతులకు తక్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు. మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని కొండెం–మంచిప్ప చెరువు ప్రాంతాన్ని సందర్శించిన వారు రైతుల సమస్యలు, వినతులను స్వీకరించి ప్రాజెక్టు పురోగతిపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2009–2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన అసలు డిజైన్‌తో ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగాయని, సుమారు రూ.1,300 కోట్ల అంచనాతో ప్రతిపాదించిన ప్రాజెక్టులో దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో 85 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు డిజైన్‌ను రద్దు చేసి రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చిందని విమర్శించారు.రీడిజైన్ కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ.3,000 కోట్ల వరకు పెరిగిందని, దాదాపు రూ.1,800 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ రైతులకు ఉపయోగపడే విధంగా పనులు పూర్తి కాలేదని ఆరోపించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పనులను భారీ వ్యయంతో మార్చడం వెనుక కమీషన్ల రాజకీయమే ప్రధాన కారణమని విమర్శించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే గతంలో కాంగ్రెస్ రూపొందించిన పాత డిజైన్‌ను పునరుద్ధరించి అదే ప్రణాళిక ఆధారంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు సాంకేతిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.రైతుల విజ్ఞప్తి మేరకు మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టు ద్వారా సిరికొండ, ధర్పల్లి మండలాలకు ఓపెన్ కెనాల్ ద్వారా సాగునీరు అందించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. గుంట భూములు కోల్పోకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లోని సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. దాదాపు 50 కిలోమీటర్ల మేర ఓపెన్ కెనాల్స్ నిర్మించడం ద్వారా నీటి నిల్వలు పెరిగి వ్యవసాయానికి శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.త్వరలో సాంకేతిక ప్రణాళికలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజాధనాన్ని వృథా చేసే విధానాలకు బదులుగా రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి నమూనానే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసిన వారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాన్నే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో కూడా అమలు చేయడానికి ప్రయత్నించారని, దాని ఫలితంగా వ్యయభారం పెరిగి ప్రాజెక్టుల లక్ష్యం దెబ్బతిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పారదర్శకత, శాస్త్రీయ ప్రణాళిక, రైతు సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకొని ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి , రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్,, మాజీ ఐసిడిఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.