టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల మహోత్సవం
– పాత కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
– అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

నిజామాబాద్ అర్బన్, ఆగష్టు 05 ( లోకంతీరు న్యూస్ ) : తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (TNGOS) సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ పాత కలెక్టరేట్ ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించిన బోనాల మహోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బోనాల మహోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల జీవితాల్లో సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా TNGOS ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాసేవలో ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని అభినందించారు.కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డికి TNGOS జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం బోనాల మహోత్సవం వైభవంగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న, పార్టీ మండల అధ్యక్షుడు జనార్దన్, మోహన్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.