నిజామాబాద్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన


నిజామాబాద్, ఆగస్టు 22 ( లోకంతీరు న్యూస్ ) : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నాగారంలోని నిర్మితి కేంద్రంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారుల కోసం నిర్మించనున్న హౌసింగ్ టవర్స్ స్థలాన్ని పరిశీలించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆరు అంతస్తులతో కూడిన టవర్స్ నిర్మించనున్న నేపథ్యంలో తగిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. అనంతరం 43వ డివిజన్ లోని పాముల బస్తీలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి భేటీ అయ్యారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, సకాలంలో బిల్లులు వచ్చాయా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ సొంత ఇంటి కలను సాకారం చేసిందని లబ్దిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వారి సంతోషంలో పాలు పంచుకోవడం తనకు కూడా ఎంతో అందంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి హర్షం వెలిబుచ్చారు. లబ్ధిదారులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన వస్త్రాలు బహూకరించారు. చివరి దశ నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం పరిశీలించి, త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. అక్కడి నుండి మంత్రి పొంగులేటి ఐ.డీ.ఓ.సీని ఆనుకుని నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళను పరిశీలించారు. మంత్రి వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, హౌసింగ్ శాఖ ఎం.డీ వీపీ.గౌతం, కలెక్టర్ భవేష్ మిశ్రా, సీ.పీ సాయి చైతన్య, డీ.ఆర్.ఓ గీత, ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు.