ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
– విద్యార్థి ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దక్కిన విజయం
– ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
– కేంద్రం పై రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే మంత్రి రాజీనామా
– పట్టుబట్టి.. రాజీనామా చేసేలా కాంగ్రెస్ పోరాటం చేసిందని స్పష్టీకరణ
– విద్యార్థుల గొంతుకగా కాంగ్రెస్ నిలిచింది
– కేంద్ర మంత్రి రాజీనామా.. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం
– రాజీనామా మాత్రమే కాదు అన్ని డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం

నిజామాబాద్ రూరల్ , జులై 25 ( లోకంతీరు న్యూస్ ) : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థులు సాగించిన ఉద్యమానికి, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరంతర పోరాటానికి లభించిన విజయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాదని, విద్యార్థుల ఐక్యత, ప్రజాస్వామ్య ఉద్యమాలు, ప్రతిపక్షాల ఒత్తిడి ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిన పరిస్థితికి నిదర్శనమని అన్నారు.నీట్ వ్యవహారంలో విద్యార్థులకు జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, యువత, ప్రజాసంఘాలు చేపట్టిన ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అండగా నిలిచిందని తెలిపారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చ పెట్టాలని ఒత్తిడి తేవడం, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారని గుర్తు చేశారు.
జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, అందులో ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, నీట్ బాధితులకు పరిహారం అందించి న్యాయం న్యాయం చేయాలని, నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నాలుగు ప్రధాన డిమాండ్లతో కాంగ్రెస్ నాయకత్వం పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందన్నారు.* ఈ క్రమంలో రాహుల్ గాంధీపై జరిగిన అక్రమ అరెస్టును దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించిందని తెలిపారు. ఈ డిమాండ్లలో కేంద్ర మంత్రి రాజీనామా ఒక్కటే కాకుండా మిగతా డిమాండ్లు కూడా కేంద్రం నెరవేర్చాలని ఆ డిమాండ్ల సాధన దిశగా కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా నిరసనలు చేపట్టాయని, తన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆందోళనలు నిర్వహించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని, ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ ప్రజలు ఇచ్చిన తొలి రాజకీయ హెచ్చరికగా దీనిని చూడాలని అన్నారు. ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే దిశగా తొలి అడుగుగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో విద్యార్థులు, యువత, రైతులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండదని, ప్రజల తరఫున మరింత బలంగా ఉద్యమాలు చేపట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ ఉద్యమంలో భాగస్వాములైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, యువతకు ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ముందుండి విద్యార్థుల పోరాటానికి ఆజ్యం పోసి డిమాండ్ల సాధనకు కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలియజేశారు.