కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభను జయప్రదం చేయండి
నిజామాబాద్, జులై 26 ( లోకంతీరు ) : సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జాతీయ నాయకులు, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ పోస్టర్లను పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ 50 సంవత్సరాలు పైగా సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేశారన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్ మరణం పార్టీకి, విప్లవోద్యమానికే కాకుండా, పీడిత వర్గాలకు ఎనలేని లోటన్నారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సోదరులు నలుగురూ విప్లవోద్యమానికి తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. కామ్రేడ్ చంద్రశేఖర్ అనేక సంవత్సరాలు అజ్ఞాతదళ జీవితం గడిపారున్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడుగా రైతాంగ పోరాటాల్లో, ఇటీవల కాలంలో జరిగిన దేశవ్యాప్త రైతు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణంకోసం ఎనలేని కృషి చేశారన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్ కు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 28న సంస్మరణ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు పార్టీ జాతీయ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్, రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తదితరులు ముఖ్యవక్తలుగా హాజరవుతారన్నారు. విప్లవాభిమానులు జయప్రదం చేయాలన్నారు.పీడితజన విముక్తికోసం, సమ సమాజం కోసం ఉద్యమించిన కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాల సాధనలో పయనించడమే కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వెంకన్న, సహాయ కార్యదర్శి సీహెచ్ సాయగౌడ్, జిల్లా నాయకులు డి.కిషన్, మురళి, మోహన్ పీ.ఓ.డబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి పీ.డీ.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, ఐ.ఎఫ్.టీ.యు జిల్లా నాయకుడు సాయరెడ్డి, కిరణ్, గంగాధర్, పీఓడబ్ల్యు నాయకురాలు సుధారాణి, అమూల్య, నసీర్, సృజన్,శివ కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
