“ఆసరా” పెన్షన్ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలి

నిజామాబాదు, నవంబర్ 24 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లాలో అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్ తక్షణమే విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సమీర్ హైమద్ జిల్లా కలెక్టర్ కి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు భరోసా, గౌరవంతో కూడిన జీవనాన్ని అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆసరా” చేయూత పెన్షన్ పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, ఓంటరివారు, బీడీ కార్మికులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారున్నారు. అయితే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మెనిఫెస్టోలో ప్రకటించినట్లు, వృద్ధులకు పింఛన్ మొత్తాన్ని ₹2,000 నుండి ₹4,000 కు, దివ్యాంగులకు 4,000 నుండి ₹6,000 కు పెంచుతామని రైతు, కార్మిక, బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో పింఛన్ బకాయిలు విడుదల కాకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అంతేకాక, 30 లక్షలకు పైగా నూతన ఆసరా దరఖాస్తుదారులు ఎప్పుడు పింఛన్ మంజూరు అవుతుందో తెలుసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అనేక చోట్ల అప్లికేషన్లను సైతం స్వీకరించకపోవడం ఆందోళనకరం. అర్హులైన పౌరులు గౌరవంతో జీవించడానికి ఈ పింఛన్ వారికి ఎంత ముఖ్యమో ప్రభుత్వం గమనించాలి. వృద్ధాప్యం, వైకల్యం, ఆర్థిక నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న ఈ వర్గాల సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు “ఆసరా” పెన్షన్ ను తక్షణమే విడుదల చేయవలసిందిగా కోరారు.