సాలూర మండలం నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
-
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల తీవ్ర ఆగ్రహం
-
– సాలురా తహసీల్దార్ చేయవలసిన పని బోధన్ తహసీల్దార్ చేస్తున్నాడు
-
సెలవు లో వెళ్లిన రూరల్ ఎస్సై
-
సాలూర తహసీల్దార్ పూర్తిగా మౌనమని ప్రజల ఆగ్రహం

ఎడపల్లి , జనవరి 30 ( లోకంతీరు ) : సాలూర మండల పరిధిలోని మంధర్నా మంజీరా ప్రాంతం నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇసుక మాఫియా బహిరంగంగానే అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.రూరల్ ఎస్సై సెలవుపై వెళ్లిన అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోందని స్థానికులు చెబుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా భారీ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని, ముఖ్యంగా రాత్రివేళల్లో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇసుక వాహనాల వల్ల గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని, దుమ్ము ధూళి కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని వారు ప్రశ్నిస్తున్నారు.ఈ అక్రమ రవాణాపై సాలూరు మండల తహసీల్దార్ పూర్తిగా మౌనం వహిస్తున్నారని, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇసుక మాఫియాకు అండగా మారిందని స్థానికులు డిపడుతున్నారు.జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మంధర్నా మంజీరా ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, మాఫియా వెనుక ఉన్న వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.ఇలా అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే ప్రజా ఉద్యమానికి దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.