ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి
– మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
![]()
హైదరాబాద్, ఫిబ్రవరి 17 ( లోకంతీరు ) : కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న,మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర సమాచార, పౌరసంబధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. మంగళవారం ఆయన పలువురు ఫెడరేషన్ నాయకులు సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.మామిడి సోమయ్య మంత్రితో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో గత పదేండ్లు చిన్న, మధ్య తరహా పత్రికల అణచివేత కొనసాగిందని,ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వంలో న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మీడియా సంస్థలకు ఈ సారి 44 వేలకు పైగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, కేవలం ఎంపానల్మెంట్ అయిన కొన్ని పత్రికలకు,చానళ్ళకు మాత్రమే ఇస్తున్నారని, ఎంపానల్ కాని ఆర్ఎన్ఐ,పీఆర్జీఐ రిజిస్ట్రేషన్ తో నడుస్తున్న అమిగతా పత్రికలకు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపానల్మెంట్ తో సంబంధం లేకుండా ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న అన్ని పత్రికలకు ఆయా పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్ కార్డులిచ్చే వారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవ్వడం లేదని, ఎంపానల్మెంట్ అనేది కేవలం ప్రభుత్వ అడ్వర్టయిజ్మెంట్లకే అని ఆయన మంత్రికి వివరించారు.ఆర్ఎన్ఐ,పీఆర్జీఐ గుర్తింపు ఉన్న పత్రికలను ఎంప్యానల్ చేయాలని,అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని మామిడి సోమయ్య మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రింటింగ్ ప్రెస్ కోసం ఒక ఎకరం భూమిని ప్రభుత్వ నామినల్ ధరకు ఇచ్చి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఉన్న జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ప్రయాణించేందుకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని, హెల్త్‌కార్డులు,భీమా సౌకర్యం కల్పించాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, నాయకులు హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, కో- కన్వీనర్లు శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్వాయి జానయ్య, హరి ప్రసాద్ తదితరులున్నారు.
