ఆట్యా-పాట్యా రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్‌కే పాఠశాల విద్యార్థినుల ఎంపిక

నిజామాబాద్, జూలై 06 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ నగరంలోని డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వహించనున్న అండర్-14 రాష్ట్రస్థాయి ఆట్యా-పాట్యా పోటీలకు ఆర్యసమాజ్‌లోని రాధాకృష్ణ (ఆర్‌కే) పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు.9వ తరగతి విద్యార్థిని ప్రణవశ్రీ, 8వ తరగతి విద్యార్థిని దుర్గ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థినులు ఈ స్థాయికి చేరుకోవడంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీకాంత్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణతో పోటీల్లో రాణించాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థినులను అభినందించిన వారిలో ఆర్యసమాజ్ అసోసియేషన్ అధ్యక్షుడు సి. నారాయణ, కార్యదర్శి డి. వెంకటనరసయ్య తదితరులు ఉన్నారు.ఈ పోటీలను తెలంగాణ స్టేట్ ఆట్యా-పాట్యా అసోసియేషన్ (ఖేలో ఇండియా అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.