నిర్దేశిత లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి
– జిల్లా అధికారులతో సమీక్షలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, ఆగస్టు 01 ( లోకంతీరు, ) : నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై ఒక్కో మండలం వారీగా చర్చిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు, రెండు పడక గదుల ఇళ్ళ కేటాయింపు, ఆయిల్ పాం సాగు, ఎరువుల పంపిణీ, వన మహోత్సవం, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, ఆహార భద్రత కార్డులు, గ్రామీణ అభివృద్ధి, నీటి పారుదల, తాగునీటి సరఫరా, ఖరీఫ్ సాగు, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, విద్యుత్ సరఫరా, రోడ్లు-భవనాలు, విద్య, వైద్యం, భారీ వర్షాలు కురిసిన సమయాలలో చేపట్టాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సజావుగా జరిగేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్ళు, అంగన్వాడి, ఆసుపత్రులు వంటి వాటికి సంబంధించిన అసంపూర్తి భవనాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నచిన్న కారణాల వల్ల పనులు పెండింగ్ లో ఉండకూడదని, ఒక్కో శాఖ వారీగా మండల స్పెషల్ ఆఫీసర్ లు దృష్టిని కేంద్రీకరిస్తే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ బడులలో ఇంకనూ అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను గుర్తిస్తూ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతిపాదనలు సమర్పించేలా చూడాలన్నారు. మండల వనరుల కేంద్రం భవనాల నిర్మాణాల కోసం ఇప్పటికే స్థల కేటాయింపులు పూర్తయిన చోట పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాధాన్యత కలిగిన పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలను క్షేత్రస్తాయిలో పరిశీలిస్తూ, నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. మంజూరీలు పొందిన లబ్దిదారులు అందరూ ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించేలా ప్రోత్సహించాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపకపోతే, అలాంటి వారి నుండి రాతపూర్వకంగా లేఖలు తీసుకోవాలని, వారి స్థానంలో అర్హులైన ఇతరులకు ఆ ఇళ్ళను కేటాయించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున తోడ్పాటును అందిస్తున్న దృష్ట్యా లబ్దిదారులు అందరూ త్వరితగతిన నిర్మాణాలు చేపట్టి, సకాలంలో పూర్తి చేసేలా క్షేత్రస్థాయి సిబ్బందిచే నిరంతర పర్యవేక్షణ చేయించాలని అన్నారు. ఆయా నియోజకవర్గాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారికి కేటాయించాలని అన్నారు. పదిహేను రోజులలో రెండు పడక గదుల ఇళ్ళ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించారు.
కాగా, అధిక లాభాలను అందించే ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ హితవు పలికారు. నిర్దేశిత లక్ష్యానికి మించి జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టేందుకు రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చేలా వారిని చైతన్యపర్చాలన్నారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా చేకూరే ప్రయోజనాలను, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, గిట్టుబాటు ధర తదితర విషయాలను వివరిస్తూ విస్తృత అవగాహన కల్పించాలని, నిర్ణీత లక్ష్యానికి మించి రైతులు ఈ పంట సాగు కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. ఇదిలాఉండగా, జిల్లాలో వానాకాలం పంట సాగుకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే అన్ని ప్రాంతాలలో యూరియా, ఇతర ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. అన్ని విక్రయ కేంద్రాలు, గోడౌన్ ల వద్ద ఎరువుల నిల్వల వివరాలతో కూడిన స్టాక్ బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఎక్కడ కూడా ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని అన్నారు. ఎక్కడైనా ఎరువులను దారి మళ్లిస్తే రైతులు, ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించాలని అన్నారు.
పట్టణాలు, గ్రామాలలో ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా అనునిత్యం పర్యవేక్షణ జరపాలని సూచించారు. మంచినీరు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల ఆధ్వర్యంలో అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను, సత్వరమే పూర్తి చేయించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అయినందున, కొత్త కార్డుల కోసం, సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలన పూర్తి చేయాలని సూచించారు. వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
—————————