జానకంపేట గ్రామ అభివృద్ధికి సహకరించాలని వినతి

ఎడపల్లి, డిసెంబర్ 26 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామ సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధా కిషన్ గౌడ్ లు శుక్రవారం ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసనసభలో సుదర్శన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత పాలకుల వైఫల్యంతో గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సర్పంచ్ సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించి తమ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము గ్రామ సర్పంచ్ గా గెలిస్తే అభివృద్ధి సాధ్యమని భావించి గ్రామ ప్రజలు తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని సర్పంచ్ స్పష్టం చేశారు. మార్గదర్శకులు సుదర్శన్ రెడ్డి హయాంలో తనను గెలిపించిన గ్రామ ప్రజలకు అభివృద్ధి అనే పదానికి నిర్వచనం అంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. సుదర్శన్ రెడ్డి ఆశీస్సులు సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు నడిపేందుకు సాయశక్తులా కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. అలాగే గ్రామం లో గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించాలని గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డికి సర్పంచ్ విన్నవించగా సానుకూలంగా స్పందించి గ్రామంలో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చేపూరి గంగా కిషన్, సీనియర్ నాయకులు తాళ్ళ విజయ్ కుమార్ గౌడ్, జహీరోద్దీన్, అశ్వక్ హుస్సేన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.