42 వ డివిజన్ లో అద్వన్న స్థితిలో రోడ్లు
పట్టించుకోని అధికారులు….
నిజామాబాద్ ,జనవరి 09 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని 42వ వార్డులో రోడ్ల దుస్థితి అద్వన్న స్థితిలో చేరుకున్నాయి. ఈ విషయం పై అధికారుల “ప్రజాసేవల వైఫల్యం”పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నిజామాబాద్ నగరంలోని 42వ వార్డు, చంద్రశేఖర్ కాలనీలో నెలకొన్న ప్రజా సమస్యల పట్ల మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సమీర్ అహ్మద్ మండిపడ్డారు. కాలనీలో రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నరన్నారు. మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అధికారుల “ప్రజాసేవల వైఫల్యానికి” నిదర్శనమని ఆయన విమర్శించారు.
రిపేరుకు నోచుకోని జేసీబీ – నిలిచిపోయిన పనులు….
ముఖ్యంగా జోన్ 4 పరిధిలో పనులు చేయాల్సిన జేసిబి గత కొంతకాలంగా రిపేర్‌లో ఉన్నా, దానిని బాగు చేయించి ప్రజా సమస్యలు తీర్చడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని సమీర్ అహ్మద్ ఆరోపించారు. అధికారులు కేవలం సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, దీనివల్ల కాలనీలో కనీస పనులు కూడా జరగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యం – అబద్ధపు హామీలు:
గత రెండు నెలల క్రితమే రోడ్ల దుస్థితిపై కమిషనర్‌కు వినతి పత్రం అందించినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఏఈ సల్మాన్ మొయినుద్దీన్‌కు పలుమార్లు ఫోన్ చేసినా “వస్తున్నా.. చేస్తున్నా” అని అబద్ధపు మాటలతో కాలం గడుపుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపడం లేదన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్లు
జోన్ 4 పరిధిలోని జేసీబీ ని తక్షణమే రిపేర్ చేయించి, కాలనీలో నిలిచిపోయిన పనులను ప్రారంభించాలి.చంద్రశేఖర్ కాలనీలో దెబ్బతిన్న రోడ్లపై వెంటనే మొరం లేదా డస్ట్ వేయించి రాకపోకలను పునరుద్ధరించాలని ,ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజాసేవలో విఫలమైన అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనలు చేపడతామని సమీర్ అహ్మద్ హెచ్చరించారు.